Indiramma Indlu : దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి
804 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల అందజేత

దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి
— ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
— 804 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల అందజేత
అబ్దుల్లాపూర్ మెట్ — ప్రభాత సూర్యుడు
వచ్చే దసరా వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని, గృహ ప్రవేశాలు చెయ్యాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి లబ్ధిదారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో మంజూరైన 804 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా గురువారం అందజేశారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఓ కన్వెన్షన్ సెంటర్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాల అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీల్లో భాగంగా అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల అందజేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని పేర్కొన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, తెలంగాణ ఏర్పడ్డాక తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, డబల్ బెడ్ రూమ్ ల పేరుతో పేద ప్రజలకు అరచేతిలో వైకుంఠ చూపెట్టిందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరుతుందని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ధ్యేయమని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం తాజా మాజీ ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు, తాజా మాజీ వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు సిద్ధంకి కృష్ణారెడ్డి, పసుల రాజేందర్, వడ్డేపల్లి విద్యావతి విజయేందర్ రెడ్డి, బొర్ర అనురాధ సురేష్, జోర్క గీతా శ్రీరాములు, మాజీ కౌన్సిలర్లు గంట లక్ష్మారెడ్డి, చెరుకూరి రేణుక జగన్, నాయకులు యంజాల గిరి, అధికారులు ఆర్డీవో అనంతరెడ్డి, తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి, అభివృద్ధి అధికారి శ్రీ వాణి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, సిబ్బంది మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
దశల వారీగా 5 లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోకి..
ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారులు త్వరిత గతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. నాలుగు దఫాలుగా నేరుగా ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లోకి జమ అవుతాయని, లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని 66 గజాల్లో పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఎవ్వరికి ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన పనిలేదని, ఇంటి నిర్మాణాన్ని బట్టి దశలవారీగా ప్రభుత్వం నుండే నేరుగా లబ్ధిదారులకు డబ్బులు జమ అవుతాయని తెలిపారు