Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
మూకుమ్మడిగా కమలం గూటికి కాంగ్రెస్ శ్రేణులు
.jpeg)
అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
- ఎమ్మెల్యే తీరుకు కాంగ్రెస్ కార్యకర్తల ఝలక్
- మూకుమ్మడిగా కమలం గూటికి కాంగ్రెస్ శ్రేణులు
అచ్చంపేట్ - ప్రభాత సూర్యుడు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ పడింది. అచ్చంపేట్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణకు అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ తీరుకు వ్యతిరేకంగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ సీనియర్ నాయకులు మద్దెల పర్వతాలు ఆధ్వర్యంలో ఆదివారం మూకుమ్మడిగా బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజధానిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు సమక్షంలో సుమారు 100 మందికి పైగా బీజేపీ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరుతున్న వారిని రామచందర్ రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లోని అమ్రాబాద్ మండలం ఒంగురొనిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్క బాల నారాయణ మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తూ.. స్థానిక ఎన్నిక దగ్గరి నుండి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ వచ్చామని తెలిపారు. గెలిచినా, ఓడిన క్యాడర్ను కాపాడుతూ వస్తున్నామని, అలాంటి తమకు ప్రస్తుతం పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ గెలుపు కోసం ఎంతో శ్రమిచ్చామని, గెలిచాక ఎమ్మెల్యే తమను పట్టించుకోకపోగా, కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. గుర్తింపు, గౌరవం లేనిచోట ఇమడలేక బీజేపీ పార్టీలో చేరామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.