Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
- నులిపురుగు నివారణ మాత్రలు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండాలి
- జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు
ఈనెల 11న నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని, అందులో భాగంగా నులిపురుగు నివారణ మాత్రలు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేవిధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. ఒక సంవత్సరం పిల్లల నుండి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. నులిపురుగుల వల్ల పిల్లలలో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత మొదలగు వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది కావున పిల్లలందరికీ ఈ మాత్రలు వేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. దీని నివారణకు ప్రభుత్వము ప్రతి ఏటా రెండు పర్యాయాలు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు వసతి గృహాలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న 157 అంగన్వాడి కేంద్రాలలో 1242 ప్రభుత్వ పాఠశాలలో 249 ఎయిడెడ్ పాఠశాలలో 80 జూనియర్ కళాశాలలో 1379 ప్రైవేట్ పాఠశాలల్లో 263 ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వారికి మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 86,696 మందిక ఆడ, మగ పిల్లలకు ఈ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 1386 మంది ఆశా కార్యకర్తలు, 1587 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర రావు , వైద్య, విద్య ఐసిడిఎస్ మరియు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.